న్యూస్ టోన్, నవంబరు 24 : ఉపాధ్యాయ సంఘాల డిమాండ్ల మేరకు టీచర్ల సాధారణ బదిలీ షెడ్యూల్‌ను సవరించను న్నారు. విద్యాశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేయడంతో రెండు నుంచి ఐదు రోజులపాటు షెడ్యూల్ పొడిగించే అవకాశా లున్నాయి. దీనివల్ల గ్రేడ్ – 2 హెచ్‌ఎంల బదిలీకి గరిష్ట సర్వీసును ఐదేళ్ల స్టేషన్ సర్వీసుగా తీసుకోనుం డడంతో తప్పనిసరి బదిలీ జాబితా నుంచి సుమారు 25 మంది ప్రధానోపాధ్యాయులకు బదిలీ నుంచి ఉపశమనం కలగనుంది. మిగతా టీచర్లకు సంబంధించి 55 ఎన్‌టైటిల్‌మెంట్ పాయింట్ల పరిమి తిని, టోటల్ పాయింట్స్ 85 పరిమి తిని తొలగించారు. ఇక సర్వీసు సీనియార్టీ పాయింట్లను 15 నుంచి 16.5కు పెంచడం వల్ల జూనియర్లతో సమానంగా ఉన్న సీనియర్ టీచర్లు ఒక్కసారిగా బదిలీల్లో ముందుకు వచ్చే ప్రయో జనం లభించనుంది. మంగళవారం జరగాల్సిన సీనియార్టీ జాబి తాల విడుదల ప్రక్రియను నిలిపివేయడంతో సవరించిన బదిలీ షెడ్యూల్ విడుదల కావాల్సి ఉంది.
సమ్మేటివ్ పరీక్ష ఈ ఏడాదికి ఒక్కటే
- ఫార్మేటివ్ పరీక్షల్లోనూ సడలింపులు
- పాఠశాల విద్యా శాఖ నిర్ణయం!
న్యూస్ టోన్, అమరావతి: రాష్ట్రంలో 2020-21 విద్యా సంవత్సరం చాలా ఆలస్యంగా ప్రారంభం కావడం, ముఖాముఖి తరగతుల నిర్వహణ కూడా విద్యార్థులందరికీ ఇంకా పూర్తిస్థాయిలో అమలు కాని నేపథ్యంలో.. ఆ ప్రభావం ఫార్మే టివ్, సమ్మేటివ్ పరీక్షలపై పడుతోంది. గతంలో ఏటా మూడు సమ్మేటివ్లు, 4 ఫార్మే టిట్లుండగా వాటిని ప్రభుత్వం కుదించింది సమ్మేటివ్ ను రెండుగా చేసింది. అయితే ఇప్పుడు కోవిడ్ వల్ల పాఠశాల విద్యా శాఖ సమ్మేటివ్ ను ఒక్కదానికే పరిమితం చేసింది విద్యార్థులకు ఫైనల్ పరీక్షలు మాత్రమే నిర్వ హించనుంది. మరోవైపు ఫార్మేటివ్ పరీక్షలు నాలుగింటిని కూడా రెండుకు కుదించింది. ఈనెల 2 నుంచి పాఠశాలలు పునఃప్రారంభిం చినా అన్ని తరగతులను నిర్వహించలేని పరి స్థితులుండటంతో వాటిలో కూడా సడలింపులు చేపట్టింది. విద్యార్థులు భౌతిక దూరం పాటించేందుకు వీలుగా 8, 9 తరగతులను రోజువిడిచి రోజు నిర్వహిస్తున్నారు. డిసెంబర్ నుంచి ప్రారంభమయ్యే 6, 7 తరగతు లను కూడా రోజువిడిచి రోజు పెట్టనున్నారు ఇక ఎలిమెంటరీ తరగతుల ప్రారంభంపై సంక్రాంతి తర్వాత నిర్ణయం తీసుకోనున్నారు. తల్లిదండ్రుల సమ్మతి మేరకే విద్యార్థులను స్కూళ్లకు రప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు హాజరు నుంచి కూడా మినహాయింపు ఇవ్వనున్నారు. విద్యార్థులందరికీ ఫార్మేటివ్ పరీక్షల నిర్వహణ ఇబ్బందిగా మారడంతో వాటి నుంచి కూడా సడలింపులకు అవకాశం కల్పిస్తున్నారు. ప్రాజెక్టు ఆధారిత పరీక్షలను నవంబర్ చివరి వారంలో, ఫార్మేటివ్-1 డిసెంబర్ చివరి వారంలో, ఫార్మేటివ్-2 ఫిబ్రవరి చివరి వారంలో, సమ్మేటివ్ పరీక్ష లను ఏప్రిల్ చివరి వారంలో నిర్వహించ నున్నారు తరగతి గదిలో బోధించే అంశాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుని సమ్మేటివ్ పరీక్షలు పెడతారు. పదో తరగతి పరీక్షల్లో ప్రశ్నలను కూడా తరగతుల్లో బోధించిన అంశాలను ఆధారంగా చేసుకొనే ఇవ్వనున్నారు.
ఐదేళ్లు పూర్తయిన ప్రధానోపాధ్యాయులకు బదిలీ
న్యూస్ టోన్, అమరావతి: ఉపాధ్యాయ బదిలీల నిబంధనలను సవరిస్తూ పాఠశాల విద్యాశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబరు ఒకటికి ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ప్రధానోపాధ్యాయులకు తప్పనిసరి బదిలీ ఉంటుంది. గతంలో 5 అకడమిక్ సంవత్సరాలు ఉండగా.. దానిని ఐదేళ్లుగా మార్పు చేసింది. ప్రస్తుత పాఠశాలలో ఎన్నేళ్లు పని చేస్తే అన్ని స్టేషన్ పాయింట్లు ఇస్తారు. గతంలో గరిష్ఠంగా 8 ఏళ్ల సర్వీసు పరిమితి విధించగా.. పని చేసిన కాలానికి పూర్తిగా పాయింట్లు ఇచ్చేలా సవరణ తీసుకొచ్చింది. సర్వీసు పాయింట్లు గరిష్ఠంగా 15 ఉండగా వీటిని 16.5 పాయింట్లుగా మార్పు చేసింది. 33 ఏళ్ల వరకు సర్వీసుకు పాయింట్లు కేటాయిస్తారు.
24 వేల మందికి తప్పనిసరి బదిలీ!
- కొనసాగుతున్న ఉపాధ్యాయుల దరఖాస్తుల పరిశీలన
ఈనాడు, అమరావతి: ఉపాధ్యాయుల బదిలీలకు రాష్ట్రవ్యాప్తంగా 75,718 మంది దరఖాస్తు చేశారు. వీరిలో తప్పనిసరి బదిలీ అయ్యేవారు 24,535 మంది ఉండగా.. రెండేళ్లు పూర్తి చేసుకుని అభ్యర్థన బదిలీలకు దరఖాస్తు చేసుకున్నవారు 51,183 మంది ఉన్నారు. దరఖాస్తుల పరిశీలన బుధవారం రాత్రి వరకు జరగనుంది. ప్రాథమిక సీనియారిటీ జాబితాను ఈ నెల 19 నుంచి 23వ తేదీ వరకు జిల్లాల వారీగా అందుబాటులో ఉంచనున్నారు.
ఉపాధ్యాయుల బదిలీల్లో ప్రస్తుతం పట్టణాలు, నగరాలకు సమీపంలో పని చేస్తున్న వారిలో సుమారు 10వేల మంది మారుమూల ప్రాంతాల్లోని కేటగిరీ-3, 4లోని బడులకు బదిలీ అయ్యే అవకాశం ఉంది. తప్పనిసరి బదిలీకి దరఖాస్తు చేసిన వారిలో సుమారు 8వేల మంది హేతుబద్ధీకరణ కారణంగా పోస్టులు కోల్పోయినవారు ఉన్నారు.
ఆన్‌లైన్ వద్దు: జాక్టో
ఉపాధ్యాయుల బదిలీలను మాన్యువల్ కౌన్సెలింగ్ ద్వారా నిర్వహించాలని కోరుతూ మంత్రి ఆదిమూలపు సురేశ్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిలను ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి(జాక్టో) ఛైర్మన్ జాలిరెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీధర్‌రెడ్డి మంగళవారం కలిసి వినతిపత్రాలు సమర్పించారు. పోస్టుల ఖాళీలన్నింటినీ చూపించాలని, 2019 జూన్ నుంచి ఇచ్చిన పదోన్నతులు, ఉన్నతీకరించిన భాషాపండితులు, వ్యాయామ ఉపాధ్యాయ స్థానాలను ఖాళీలుగా చూపించాలని, సర్వీసు పాయింట్లను ఏడాదికి ఒకటి చొప్పున కేటాయించాలని కోరారు.
బదిలీ దరఖాస్తుల వెరిఫికేషన్ కు ఉపాధ్యాయులను ఆఫీస్ కి రప్పించ కూడదు – జేడీ దేవానంద్ రెడ్డి
- ఏ విధమైన హార్డ్ కాపీలు అడగకూడదు
- 75,718 దరఖాస్తుల స్వీకరణ – జేడీ
అమరావతి, న్యూస్ టోన్: ఉపాధ్యాయ బదిలీల దరఖాస్తు నిన్నటి తో ముగిసింది. 75,718 మంది ఉపాధ్యాయులు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకున్నట్లు జే.డీ దేవానంద్ రెడ్డి తెలిపారు. ఇందులో 24,500 మంది తప్పని సరి బదిలీ కావాల్సిన ఉపాద్యాయులు అని తెలిపారు. ఎం.ఈ.ఓ లు డీ.వై.ఈ.ఓ లు ఈ నెల 17,18 తేదీలలో ఈ దరఖాస్తులను వెరిఫై చేయాల్సి ఉంటుంది అని తెలిపారు. ఇలా వెరిఫై చేయడానికి ఉపాధ్యాయులను ఎవరినీ కార్యాలయాలకు రప్పించ కూడదని, అదే విధంగా ఉపాధ్యాయులను ఎవరినీ హార్డ్ కాపీలు అడగ కూడదనీ అధికారులను ఆదేశించారు.
స్కూళ్ళలో ఇష్టం వచ్చిన స్టడీ మెటీరియల్ వాడటానికి వీలు లేదు
- స్టడీ మెటీరియల్ ను ఇష్టా రాజ్యంగా వాడొద్దు
- సి.సి.ఈ స్ఫూర్తి కి విరుద్ధం
అమరావతి, న్యూస్ టోన్: పాఠశాలల్లో ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు ప్రైవేట్ స్టడీ మెటీరియల్ ను కానీ, గైడ్ లను వాడటానికి వీల్లేదని ఎస్.సీ.ఆర్.టి డైరెక్టర్ స్పష్టం చేశారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇలా ఇతర మెటీరియల్ వాడటం వలన సి.సి.ఈ విద్యా విధానం స్ఫూర్తి దెబ్బ తింటుందని తెలిపారు. దీనిపై 2014 లోనే స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ పాటించడం లేదని అన్నారు. అన్ని విద్యా సంస్థలలో ఇలాంటి మెటీరియల్ వాడకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
జగనన్న విద్యాకానుక షూ పంపిణీలో నిర్లక్ష్యం
- షూ పంపిణీ లో ప్రధానోపాధ్యాయుల నిర్లక్ష్యం – కమీషనర్
- అన్నీ సరిగా ఇచ్చేసి నట్టు తప్పుడు నివేదికలు పంపారు – కమీషనర్
అమరావతి: ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న జగనన్న విద్యా కార్యక్రమం సరిగా అమలు కావట్లేదు. ముఖ్యంగా షూ పంపిణీలో ప్రధానోపాధ్యాయులు అడుగడుగునా నిర్లక్ష్యం ప్రదర్శించారు అని విద్యాశాఖ కమిషనర్ అభిప్రాయ పడ్డారు. తప్పుడు నివేదిక లతో షూ పంపిణీ సరిగా నే అయినట్లు చూపుతున్నారు అని తెలిపారు. లోటుపాట్లను ముందుగానే అంచనా వేసి అనేక సూచనలు ఇచ్చినప్పటికీ నిర్లక్ష్యం ప్రదర్శించారు అని అన్నారు. ఈ మేరకు షూ పంపిణీ ప్రారంభం నుండి ఇప్పటి వరకు ప్రతి దశ లోనూ ప్రధానోపాధ్యాయులు కనబరచిన నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపుతూ దానిని సరి చేయడానికి ఆదేశాలు ఇచ్చారు. ఎం.ఈ.ఓ లు కూడా కొలతలు సరిగా లేని, డ్యామేజ్ అయిన షూ లను సేకరించి పునఃపంపిణీ చేయడం లో పూర్తి విఫలం అయ్యారని అన్నారు. ఈ నెల 19, 20 కల్లా షూ పంపిణీ పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
కమీషనర్ లేఖకు ఫ్యాప్టో సవివర సమాధానం
- విద్యాశాఖ కమిషనర్ లేఖ ను తిరస్కరిస్తున్నాం
- మా పై ఉపాధ్యాయులకు నమ్మకం సన్నగిల్లేలా ఉంది.
- మేం కోరినవీ ఏవీ మీరు అమలు చేయడం లేదు
అమరావతి, న్యూస్ టోన్: బదిలీలు, రేషనలైజేషన్ కు సంబంధించి విద్యాశాఖ కమిషనర్ తమకు రాసిన లేఖను పూర్తిగా తిరస్కరిస్తున్నామని ఫ్యాప్టో ప్రకటించింది.ఆ లేఖలోని అంశాలు తమపై ఉపాధ్యాయులకు తమపై విశ్వాసం సన్నగిల్లేలా ఉందని పేర్కొంది. ఆ లేఖ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించేలా లేదని, హామీలను విస్మరించిన ప్రభుత్వమే తమ విశ్వాసం కోల్పోయేలా ఉందని ఫ్యాప్టో ఛైర్మన్ జి.వి.నారాయణరెడ్డి, సెక్రటరీ జనరల్ నరహరి పేర్కొన్నారు. కమిషనర్ రాసిన లేఖకు ప్రతిగా అనేక అంశాలను లేవనెత్తుతూ విద్యాశాఖ కమిషనర్ కు తిరిగి ఫ్యాప్టో లేఖ రాసింది. అందులోని వివరాలు ఇలా ఉన్నాయి.
• జీవో నెంబరు 53లో కటాఫ్ తేదీ కమిషనర్ నిర్ణయిస్తారని ఉంది. ఆ తర్వాత విద్యాశాఖ ఇచ్చిన మెమోలో (13029)లో ఫిబ్రవరి 29 లేదా నవంబరు 2 లలో ఏది ఎక్కువ రోలు అయితే అది పరిగణనలోకి తీసుకుంటారని పేర్కొన్నారు. అక్టోబరు 27 నాటి చర్చల్లో ఫిబ్రవరి 2ని కొనసాగిస్తూనే అక్టోబరు 14 బదులు 31 పరిగణనలోకి తీసుకోవాలని ఫ్యాప్టో కోరింది. ఈలోపు తల్లిదండ్రలు డిక్లరేషన్ తోనే ప్రభుత్వ పాఠశాలలో చేర్చుకునేందుకు అనుమతించారు. చైల్డ్ ఇన్ ఫోలో వారిని చేర్చే అవకాశం వచ్చింది. ఫ్యాప్టో కమిషనర్ వద్ద ఉన్నప్పుడు డ్రాప్టు ఉత్తర్వులు సిద్ధమయ్యాయి. కానీ మెమోలో మళ్లీ నవంబరు 2 కటాఫ్ తేదీగా నిర్ణయించారు. చైల్డ్ ఇన్ ఫో లో మీడియం ఆప్షన్ సరి చేయని కారణంగా అనేక పాఠశాలలు తీవ్రంగా నష్టపోతున్న విషయం నిజం కాదా? దీనిపై ఫ్యాప్టో తన లేఖ ద్వారా ఖండించింది నిజం కాదా?
• వెబ్ కౌన్సెలింగు పట్ల ఎస్ జీ టీలు ఎన్ని వేల ఆప్షన్లు ఎంచుకోవాలో అది ఎంత కష్టమో అదికారులు గుర్తించి మాన్యువల్ కౌన్సెలింగుకు అవకాశం ఇవ్వాలి. నవంబరు 10 లోపు డెమో నిర్వహిస్తామన్నారు. డెమో నిర్వహిస్తే దాన్ని కొనసాగించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మాన్యువల్ కౌన్సెలింగు మాత్రమే ఫ్యాప్టోకు సమ్మతం.
• 2015, 2017 బదిలీల్లో 5 పూర్తి సంవత్సరాలు ప్రధానోపాధ్యాయులకు చూపారు. 2020 లో అది 5 అకడమిక్ సంవత్సరాలుగా మార్చారు. ఫ్యాప్టో ముందు నుంచి 5 పూర్తి సంవత్సరాలు కోరుతోంది. 5 సంవత్సరాలకు ఇక నెలా 17 రోజులే వ్యత్యాసం ఉందని కమిషనర్ పేర్కొన్నారు. ఫ్యాప్టో వ్యత్యాసం గురించి మాట్లాడటం లేదు. భవిష్యత్తులో ఇదే విధానం కొనసాగుతుందనే ఉద్దేశంతనే ఫ్యాప్టో 5 పూర్తి సంవత్సరాలపై పట్టు పడుతోంది. కొందరు ప్రధానోపాధ్యాయులు 5 సంవత్సరాలు జీవో ప్రకారమే తీసుకోవాలని కోరి ఉన్నారని చెబుతున్నారు. రాష్ట్రంలోని ప్రధానోపాధ్యాయులకు నాయకత్వం వహించే ప్రధానోపాధ్యాయుల సంఘం ప్రతిపాదనలు, ఫ్యాప్టో ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకోకుండా వ్యక్తిగతంగా కొందరు పంపే మెస్సజిలను పరిగణనలోకి తీసుకోవడం ఎంత వరకు సమంజసం అని ఫ్యాప్టో ప్రశ్నించింది.
• కేటగిరి 1, 2 లో ఖాళీలను సిఫార్సు బదిలీలకు వదిలేయడం, కొన్ని ఖాళీలు బ్లాక్ చేయడం సరికాదని ఫ్యాప్టో ఎప్పటి నుంచో చెబుతోంది. ఇందుకు కమిషనర్ తన లేఖలో ఉపాధ్యాయులంతా తమకు కావాల్సిన కీలక స్థానాలకు వెళ్లిపోవడం వల్ల వెనుకబడిన తరగతుల పిల్లలు చదివే పాఠశాలలు, ఇతర చోట్ల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ గా ఉండిపోతున్నాయని, అందువల్లే వాటిని బ్లాక్ చేశామని చెబుతున్నారు. నిజానికి ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టలను భర్తీ చేయనంత కాలం ఈ సమస్య ఎప్పుడూ ఉంటుంది. అందరూ కేటగిరి 1, 2 లకే బదిలీ కోరతారనేది అవాస్తవవం. కేటగిరీ, 3, 4 లలో కూడా కొందరు ఉపాధ్యాయులు స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు. సిఫార్సు బదిలీలను ఫ్యాప్టో ఎత్తి చూపితే కమిషనర్ కు ఆగ్రహం వచ్చింది. వారు చేసిన సిఫార్సు బదిలీల్లో సామాజిక కోణంలో ఎన్ని బదిలీలు జరిగాయో ఎంత మంది 3,4 కేటగిరీలకు జరిగాయో చెప్పాలి . వారు చేసిన బదిలీలు అన్నీ మారుమూల ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు జరిగినవే. ఇదేనా పేదల పట్ల అధికారులకు ఉన్న బాధ్యత అని ఫ్యాప్టో ప్రశ్నించింది.
• సిఫార్సు బదిలీలన్నీ కేటగిరీ 1, 2లలో పొందినవే కదా , మళ్లీ వాటిని బ్లాక్ చేస్తే ఎలా అని ఫ్యాప్టో ప్రశ్నించింది.
• సర్వీసు పాయింట్లపై సీలింగు ఎత్తివేయాలని, పాయింట్లు ఏడాదికి ఒకటి చొప్పున ఇవ్వాలని కోరినా పరిగణనలోకి తీసుకలేదు అని ఫ్యాప్టో ప్రస్తావించింది.
• పదవీ విరమణకు 3 ఏళ్ల లోపు ఉన్నవారిని బదిలీల నుంచి మినహాయించాలని కోరామని ఫ్యాప్టో పేర్కొంది.
ఎస్.జీ.టీ లకు మాన్యువల్ కౌన్సెలింగ్ చేయాల్సిందే
- కమీషనర్ వారి సమాధానాలకు సమాధానాలు ఇచ్చిన ఫ్యాప్టో
- బీద వర్గాల పిల్లలపై మాకు ఎనలేని ప్రేమ
- కమీషనర్ వారి లేఖను అంగీకరించేది లేదు
- అసంబధ్ధ నిర్ణయాలు సరి చేయాలి
అమరావతి, న్యూస్ టోన్: ఈ నెల 09 వ తేదీన కమీషనర్ వారు ఫ్యాప్టో ప్రశ్నలకు ఘాటుగా బదులు ఇస్తూ లేఖ పంపిన విషయం పాఠకులకు విదితమే. ఈ లేఖ కు సమాధానాలు గా ఫ్యాప్టో కూడా అంతే ఘాటుగా స్పందిస్తూ కమీషనర్ కు లేఖ రాసింది. లేఖ లోని విషయాలు ఫ్యాప్టో విడుదల చేసింది. చర్చల్లో వచ్చిన విషయాలేవీ అమలుకు నోచుకోవడం లేదని ఫ్యాప్టో ఉద్ఘాటించింది. ప్రతి సందర్భం లో తాము వాడే భాష సరిగానే ఉంటుందని ఫ్యాప్టో తెలిపింది. భాష సరిగా లేదని కమీషనర్ వారు అనడం సరి కాదని తెలిపింది. సిఫార్సు బదిలీలు కేటగిరీ 1,2 పాఠశాలకు చేసి, ఇప్పుడు మిగిలినవి కూడా బ్లాక్ చేయడం సరి కాదని అభిప్రాయ పడింది. బీద వర్గాల పిల్లలపై తమకు ఎనలేని ప్రేమ, ఆప్యాయతలు ఉన్నాయని తెలిపింది. తాము వెబ్ కౌన్సెలింగ్ కు విరుధ్ధం అని తెలిపింది. కనీసం ఎస్.జీ.టీ లకు అయినా మాన్యువల్ కౌన్సెలింగ్ చేయాలని, అది కుదరని పక్షం లో ఇంజనీరింగ్ తరహా లో కౌన్సెలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేసింది. బదిలీలు, క్రమబద్దీకరణ లో అసంబధ్ధ నిర్ణయాలు సరి చేయాలి అని డిమాండ్ చేసింది.
రేపటితో ముగియనున్న బదిలీల దరఖాస్తు గడువు
- బదిలీల దరఖాస్తు గడువు తేదీ పెంచేది లేదు
- ఆదివారం ఉదయానికి దాదాపు 30,000 బదిలీ దరఖాస్తులు సమర్పణ
అమరావతి, న్యూస్ టోన్: ఉపాధ్యాయులు బదిలీలకు దరఖాస్తు చేసుకునే గడువు షెడ్యూల్ ప్రకారం రేపటి తో (సోమవారం తో) ముగియనుంది. ఇప్పటికే దాదాపు 30,000 వేలమంది ఉపాధ్యాయులు తమ దరఖాస్తులను ఆన్లైన్ లో సబ్మిట్ చేశారు. ఈ దరఖాస్తు గడువు తేదీ పెంచేది లేదని అడిషనల్ డైరెక్టర్ శ్రీ దేవానంద రెడ్డి స్పష్టం చేశారు. తప్పనిసరి బదిలీ అవ్వాల్సిన ఉపాధ్యాయులు, బదిలీ అభ్యర్ధన కోరే ఉపాధ్యాయులు రేపటి లోగా తమ దరఖాస్తులను ఆన్లైన్ లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
