ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు Free Bus Travel అవకాశం కల్పించడం ఇప్పుడే ప్రారంభమైంది. దీని ఆచరణలో ఎలాంటి సాధకబాధకాలు ఉంటాయో ఇంకా స్పష్టంగా తెలియదు. కానీ తెలంగాణ విషయానికి వస్తే, అక్కడ దాదాపు రెండేళ్లుగా ఆర్టీసీ బస్సులలో Free Bus Travel అమలవుతోంది. ఇక్కడ బస్సు కండక్టర్లు మొదటి నుండి మహిళలను అవమానించేలా రకరకాల పద్ధతులు అవలంబించారు. రెండేళ్లు గడిచాయి కాబట్టి, ఇప్పటికైనా అంతా సర్దుకుని ఉంటుందని మనం అనుకుంటాం.

Free Bus Travel
కానీ ఇప్పటికీ, మహిళలను చులకనగా మాట్లాడుతూ, అవమానిస్తూ మాట్లాడుతున్నట్టుగా, ఆధార్ కార్డు అప్డేట్ కాలేదని, ఫోటో సరిగా కనిపించడం లేదని రకరకాల సాకులు చెబుతూ, మహిళలను దూషిస్తూ, వారితో తగాదా పెట్టుకుంటూ బలవంతంగా టిక్కెట్ డబ్బు వసూలు చేస్తున్న కండక్టర్లు చాలామంది ఉన్నారు. ప్రభుత్వం ప్రారంభించిన పథకం పరువు తీసేలా, పేరుకు ఉచితం అంటూ ఏదో ఒక రకంగా దోచుకోవడమే మార్గంగా చూస్తుంటారనే అభిప్రాయం మహిళలకు కలిగేలా వీరి తంతు సాగుతోంది.
మహిళలకు Free Bus Travel అవకాశం కల్పించడం వలన, ఆర్టీసీ ఏదో కోల్పోతున్నట్టుగా కొందరు కండక్టర్లు మహిళా ప్రయాణికులను అవమానిస్తూ, హేళనగా మాట్లాడడం అనేది మొదటినుండి జరుగుతూనే ఉంది. నిజానికి ఈ ఉచిత ప్రయాణం వలన ఆర్టీసీ కోల్పోయేదేమీ లేదు. మహిళలకు జీరో టిక్కెట్ ఇస్తారు గానీ, ఆ మొత్తాన్ని కార్పొరేషన్ కు ప్రభుత్వం చెల్లిస్తుంది. దీనిని సాకుగా వాడుకుని, ఆర్టీసీ కండక్టర్లు ప్రభుత్వాన్ని దోచుకోవడానికి తొలిరోజుల్లో చాలా ఎత్తులు వేశారు.
ఉదాహరణకు, ఒక మహిళ హైదరాబాద్ జూబ్లీ స్టేషన్‌లో బస్సు ఎక్కి కొంపల్లి వరకు వెళ్లాలని టిక్కెట్ అడిగితే, కండక్టరు కరీంనగర్ వరకు టిక్కెట్ ఇచ్చేవాడు. జీరో టిక్కెటే అయినప్పటికీ, కరీంనగర్ వరకు ప్రయాణం అన్నట్టుగా అందులో ఉండేది. అదేమని అడిగితే, “ఎటూ ఫ్రీనే కదా, మాట్లాడకుండా వెళ్లండి” అనేవాడు. అంటే, ప్రభుత్వం నుంచి కరీంనగర్ దాకా టిక్కెట్ ధరను ఆర్టీసీకి దోచిపెట్టడానికి కండక్టరు ఎత్తుగడ అన్నమాట.
క్రమంగా ఇలాంటి కండక్టర్ల మోసాలను ప్రభుత్వం గుర్తించడం, వీటికి అడ్డుకట్ట పడింది. ఇప్పుడు కండక్టర్లు, మహిళలకు Free Bus Travel వల్ల తాము గానీ, తమ సంస్థ గానీ కించిత్తు కూడా కోల్పోకపోయినప్పటికీ, వారిలో మహిళా ప్రయాణికుల పట్ల చులకన భావం తగ్గడం లేదు.
“మీ ఆధార్ సరిగా కనిపించడం లేదు, ఫోటో అప్డేట్ కాలేదు. కొత్తగా తీయించుకోండి” వంటి సాకులు చెబుతూ టిక్కెట్ తీసుకోవాల్సిందే అంటున్నారు. పేదలు ఎవరైనా ఉచిత ప్రయాణం నమ్ముకుని చాలినంత డబ్బు లేకుండా వచ్చిన వారు ఉంటే వారిని మధ్యలో రోడ్డు మీద బస్సు ఆపించి దించేస్తున్నారు. తదుపరి స్టాపు వరకు కూడా ఉండనివ్వడం లేదు. మహిళలు టిక్కెట్లు తీసుకోలేదని రోడ్డు పక్కన బస్సు అరగంట పాటు ఆపించేసి, తాను చెప్పిన వాళ్లందరూ టిక్కెట్ కొన్న తరువాతనే బస్సు నడుపుతున్నారు.
ఉదాహరణకు ఈ టిక్కెట్ చూడండి. ముషీరాబాద్ రెండో డిపోకు చెందిన బస్సు ఇది. పటాన్‌చెరు నుండి మాదాపూర్ పోలీసు స్టేషన్ వరకు ప్రయాణించడానికి ఇచ్చిన టిక్కెట్. అడపాదడపా తన ఆధార్ కార్డు చూపించి ప్రయాణిస్తూ ఉన్న మహిళనే, “మీ ఆధార్‌లో ఫోటో సరిగా లేదు” అంటూ దబాయించి కండక్టరు టిక్కెట్ కొట్టిన వైనం ఇది. “దేవుడు కరుణించినా పూజారి వరం ఇవ్వలేదని” అన్నట్టుగా, ప్రభుత్వం ఉచిత అవకాశం కల్పిస్తే, దానికి కొందరు కండక్టర్లు సైంధవుల్లా అడ్డుపడుతున్నారని, తెలంగాణలోని ఈ తరహా ధోరణులు ఏపీలో కూడా జరగకుండా ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని, సిబ్బందిని హెచ్చరించాలని మహిళలు కోరుకుంటున్నారు.
మహిళల పట్ల ఒకరకమైన కక్షతో తెలంగాణలో కొందరు కండక్టర్లు చేస్తున్న ఇలాంటి పనులను కట్టడి చేయడానికి ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్, ప్రభుత్వాధికారులు చర్యలు తీసుకోవాలని మహిళలు అభ్యర్థిస్తున్నారు.
keywords: Free Bus Travel, తెలంగాణ ఆర్టీసీ, ఆంధ్రప్రదేశ్ మహిళా బస్ పాస్, ఉచిత బస్సు ప్రయాణం, మహిళల బస్సులు, కండక్టర్ల దుష్ప్రవర్తన, ఉచిత పథకాలు, ఆర్టీసీ సమస్యలు, బస్సు టిక్కెట్ మోసం, మహిళా ప్రయాణికుల హక్కులు