మహాత్ముడు పుట్టి నూటయాభయ్యేళ్ళయ్యింది. ఆయన తన జీవితకాలంలో వివిధ రంగాల్లో చేపట్టిన కృషి గురించీ, ఆయన నిర్యాణం తరువాత కూడా ప్రపంచం మీద చూపిస్తో వస్తున్న ప్రభావం గురించీ , నానాటికీ పెరుగుతున్న ఆయన ప్రాసంగికత గురించీ ఎంతయినా స్మరించుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు.
కాని నా దృష్టిలో గాంధీజీ ప్రధానంగా కవి. ఆయనలోని సత్యాన్వేషకుడు, సత్యసాధకుడు కూడా ఆయన వాక్యాల్లోని సరళ సౌందర్యం వల్లా, అపారమైన నిజాయితీ వల్లా, అచంచల ఆత్మవిశ్వాసంవల్లా మరింత ప్రస్ఫుటంగా కనిపిస్తుంటారు. గాంధీగారి లాగా ఒక వాక్యం రాయాలని నా చిన్నప్పుడు నాకు చాలా కోరికగా ఉండేది. కాని, గాంధీగారి లాగా జీవిస్తే తప్ప గాంధీగారిలాగా రాయడం సాధ్యం కాదని నెమ్మది మీద అర్థమయింది.
ప్రాతఃస్మరణీయులైన భారతీయ భక్తి కవుల కోవలో గాంధీజి ఇరవయ్యవ శతాబ్దపు భక్తి కవి.
ఒకప్పుడు ఆయన 1930 లో యరవాడ జైల్లో నిర్బంధంలో ఉన్నప్పుడు, భారతీయ భక్తి కవిత్వం నుంచి కొన్ని శ్లోకాల్నీ, గీతాల్నీ ఎంపిక చేసి మీరబెన్ కోసం ఇంగ్లీషులోకి అనువదించారు. వాటిని జాన్ ఎస్ హోలాండ్ అనే ఆయన Songs from Prison అనే పేరిట ప్రచురించారు. 1934 లో మాక్మిలన్ కంపెనీ ప్రచురించిన ఆ పుస్తకం కోసం ఎన్నాళ్ళుగానో వెతుకుతూ ఉన్నాను. ఇప్పుడది ఆర్కైవ్ లో దొరికింది.
https://archive.org/details/songsfromprison00mkga
[post_ads]
ఆ పుస్తకంలో హోలాండ్ చేసిందల్లా రవీంద్రుడి గీతాంజలి ఇంగ్లీషు అనువాదంలోలాగా భగవంతుడి నామవాచకాల్ని సర్వనామాలుగా మార్చడం, చలం వచనాన్ని వజీర్ రహ్మాన్ కవిత్వంగా అమర్చినట్టు, కవిత్వపంక్తులుగా అమర్చి పెట్టడం. కాని, ఆ ఇంగ్లీషూ, ఆ క్లుప్తతా, ఆ సాంద్రతా, ఆ సూటిదనం, ఆ నైర్మల్యం పూర్తిగా గాంధీజీవి.
నాలుగైదు కవితలు ఇక్కడ మీకోసం, తెలుగులో కాదు, గాంధీగారి ఇంగ్లీషులోనే.