Wednesday, January 28, 2026
Duniya360 - We will update latest news around the world. Duniya360.com is leading digital news website in Telugu.
ది స్పిరిట్ ఆఫ్ ది బీహైవ్ -...

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు | అక్షరాలు, సంఖ్యలు, పట్టికలు – student learning tools

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు – Duniya360 student learning...

FLN 75 Days Action Plan: ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక తరగతుల కోసం సమగ్ర మార్గదర్శి

FLN 75 Days Action Plan: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష (APTET) 2025: సంపూర్ణ మార్గదర్శకాలు

పరిచయం:ఆంధ్రప్రదేశ్ప్రభుత్వం, రాష్ట్రంలో తరగతి 1 నుండి 8 వరకు ఉపాధ్యాయులుగా నియమితులవ్వాలనుకునే...

ది స్పిరిట్ ఆఫ్ ది బీహైవ్ – రివ్యూ బై శ్రీ వాడ్రేవు చిన వీర భద్రుడు గారు

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

రోజంతా పాఠశాలల సందర్శనతో గడిచిపోయేక, సాయంకాలం ఇంటికి రాగానే అర్జంటుగా చూడవలసిన ఫైళ్ళు చూసేసాక, త్వరత్వరగా ఇంత అన్నం వండుకుని ఏదో ఒక పచ్చడితో గబగబా రాత్రి భోజనం ముగించేసాక, అప్పుడు, టాగోర్ అన్నాడే, నా పనులన్నీ ముగించుకున్నాక, అదీ నిన్ను కలిసే సమయం అని, అప్పుడు తెరిచాను, యూ ట్యూబు,  The Spirit of the Beehive  (1973) చూడటానికి.

నేను సినిమాలు చూడటం మొదలుపెట్టానని తెలియగానే జయతి ఒక మెసేజి పంపించారు. The Spirit of the Beehive అని. అంతే, అదనంగా మరొక్క మాట కూడా లేదు. మంచి సినిమాలు ఏవైనా చెప్పండి, చూస్తాను అని అప్పుడప్పుడు ఆమెని అడుగుతూ ఉన్నాను. ఆమె వాల్ మీద పరిచయం చేసిన ప్రతి ఒక్క సినిమా మరొక ప్రపంచానికి సంబంధించిన కథ. ఆ సినిమా ఏది చూసినా మనం మరొక లోకంలోకి ప్రయాణించి వస్తామని నాకిప్పటికే అనుభవం. అందుకని అన్నిటికన్నా ముందు ఆమె చెప్పిన ఆ సినిమా చూడాలని కూచున్నాను.

The Spirit of the Beehive స్పానిష్ సినిమా. బ్రిటి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ జాబితాలో 81 వ స్థానంలో ఉంది. కాని ఆ సినిమాని ఏదో ఒక జాబితాలో చేర్చడం కష్టం. ఏ జాబితాలోనూ మనం ఇమడ్చలేని మనుషులు ఉన్నట్టే కళాకృతులు కూడా ఉంటాయి. అవి కొన్ని ప్రత్యేక చారిత్రిక సందర్భాల్లో కొన్ని ప్రత్యేకకాలాల్లోనూ, ప్రత్యేక సమయాల్లోనూ మాత్రమే ప్రభవిస్తాయి. ‘నాకు తెలిసి, యజ్ఞం లాంటి కథ రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు రాసి ఉండటం సాధ్యం కాదు ‘అని రాసాడు కొడవటిగంటి కారాగారి కథని పరిచయం చేస్తూ. ఆ మాట పద్మరాజుగారి ‘గాలివాన ‘కథ గురించి కూడా చెప్పవచ్చు, ఆ కథ రెండవ ప్రపంచ యుద్ధం తరువాత మాత్రమే పుట్టే కథ అని.  The Spirit of the Beehive అట్లాంటి కథ, అట్లాంటి సినిమా. అది స్పానిష్ అంతర్యుద్ధం తరువాత మాత్రమే రాగల సినిమా. అది కూడా అంతర్యుద్ధం జరుగుతుండగానో, జరిగిన వెనువెంటనే పుట్టుకొచ్చే కథ కాదు. ఒక అంతర్యుద్ధం తరువాత, దేశం ఒక నియంతృత్వంలోకి ఇరుక్కొన్నాక, కనీసం ఒకటి రెండు తరాలు ఆ నిర్బంధాన్ని చవిచూసేక, నిర్బంధం ఒక జీవనశైలిగా మారిపోయేక, అప్పుడు కొద్దిగా డేరాలోంచి మొహం బయటకు పెట్టి తమ నిత్యజీవితంలోని భయాందోళనల్ని నేరుగా కాకుండా మరెవరికో చెందిన భయాందోళనలుగా చెప్పుకోడంలాగా పుట్టే కథ అది.

సాధారణంగా కథల్నీ, నవలల్నీ, సినిమాల్నీ పరిచయం చేసేటప్పుడు సమీక్షకులు ఆ కథాసారంశాన్నో, ఇతివృత్తాన్నో తిరిగి తమ మాటల్లో చెప్పడం రివాజు. కానీ నాకది ఇష్టం కాదు. ఒక కథని ఎవరికి వారు తమకై తాము తమ ఇంద్రియాల్తో సమీపించాలి. తమ అనుభవంగా మార్చుకోవాలి. ఈ సినిమా కూడా అటువంటిదే. 

కానీ స్థూలంగా ,ఇది,  ఇద్దరు చిన్నపిల్లల కథ. వాళ్ళిద్దరూ ఒకరోజు వాళ్ళ ఊళ్ళో టూరింగు టాకీసులో ఫ్రాంకెన్ స్టెయిన్ సినిమా చూస్తారు. అందులో ఫ్రాంకెన్ స్టెయిన్ చెరువు ఒడ్డున పువ్వుల్తో ఆడుకుంటున్న ఒక పసిపాని చూసే దృశ్యం చూస్తారు. ఆ తరువాతి ఘోరం కూడా చూస్తారు వాళ్ళు. ఆ దృశ్యం ఆ చిన్నారి పిల్ల మనసుమీద బలమైన ముద్ర వేస్తుంది. తాను కూడా తన ఇంట్లో, బళ్ళో, ఊరిబయట, దారిలో, రైలుపట్టాల మీద ప్రతి ఒక్క చోటా ఒక ఫ్రాంకెన్ స్టెయిన్ ని వెతుక్కుంటుంది. ఆమె వెతుక్కున్నట్టే ఆ ఫ్రాంకెన్ స్టెయిన్ ఆమెకి కనిపిస్తాడు. ఆకలితో, గాయపడి, రహస్యంగా తలదాచుకుని కనిపిస్తాడు. ఆమె అతడి ఆకలి తీర్చడానికి ఆహారం తెచ్చి ఇస్తుంది, చలినుంచి కాపాడుకోడానికి తండ్రి కోటు తీసుకువెళ్ళి వెస్తుంది. సపర్య చేస్తుంది. కాని ఆమెకి తెలియదు, తాను ఒక నేరస్థుణ్ణి పలకరిస్తున్నానని, అతడి పట్ల ఆత్మీయత కనపరుస్తున్నానని. అతణ్ణి పోలీసులు వెంటాడతారు, చంపేస్తారు. ఆమెకి అదంతా తెలియదు. మళ్ళా ఊరుబయట రహస్య స్థావరంలో దాక్కున్న అతణ్ణి వెతుక్కుంటుంది. అదంతా తండ్రి కంటపడుతుంది. ఆమె భయంతో ఇంటినుంచి పారిపోతుంది. ఆమెని చివరికి కనుగొంటారు. ఇంటికి తీసుకొస్తారు. కాని ఆమె అస్వస్థతకి లోనవుతుంది. ‘ఆమె పెద్ద అనుభవానికి లోనయ్యింది. నెమ్మదిగా కోలుకుంటుంది, మరేమీ కంగారు పడనవసరం లేదు ‘ అంటాడు వైద్యుడు,

తేనెపట్టులో జరిగే కల్లోలం అని పేరుపెట్టాడు తన సినిమాకి దర్శకుడు. Spirit  అంటే ఉద్వేగమూ, భూతమూ అని రెండర్థాలూ స్ఫురిస్తాయి. తేనెపట్టులో అసంఖ్యాకమైన తేనెటీగలు నిద్రాహారాలు మానుకుని అహర్నిశం రాణీ ఈగల కోసం శ్రమిస్తూనే ఉంటాయి. ఆ శ్రమలో, ఆ వ్యాపకంలో, ఆ గూడులోపల ఏదో ఒక అర్థంలేని అల్లకల్లోలం. ఎప్పుడు చూసినా ఏదో చెప్పలేని ఉద్వేగం. తన కాలం నాటి స్పెయిన్ లో జీవితం అలా ఉందంటున్నాడు దర్శకుడు. పూర్తి రాజకీయ వ్యంగ్యంతో, రాజకీయ నిరసనతో చిత్రించిన చిత్రం. కానీ ఎక్కడా రాజకీయ దృశ్యాలు కనిపించవు, రాజకీయ వాచకం వినిపించదు. ఒక రాజకీయ రచన చేస్తే ఇలా ఉండాలి అనిపిస్తుంది ఆ చిత్రం చూడటం పూర్తయ్యాక.

నాకు హారర్ కథలన్నా, సినిమాలన్నా చాలా భయం. చంద్రముఖి సినిమా చూస్తేనే భయపడిపోయిన వాణ్ణి. ఈ సినిమా కథాంశమేమిటో తెలియకుండా చూడటం మొదలుపెట్టాను కానీ, నేనొక హారర్ సినిమా చూస్తున్నానని తెలియడానికి అట్టే సేపు పట్టలేదు. ‘పిడికెడు దుమ్ములో భయోత్పాతాన్ని చూపించగలను’ అన్నాడు కవి. ఇందులో ప్రతి ఒక్క దృశ్యంలోనూ హారర్. చివరికి ఇద్దరు చిన్నపిల్లలు, సురక్షితమైన ఒక ఇంట్లో ఆడుకునే ఆటలో కూడా హారర్. ఒక దేశం మొత్తం నిర్బంధంలోకి జారుకున్నాక, ప్రతి ఇంట్లోనూ, చివరికి పిల్లలాడుకునే గుసగుసలో కూడా  భయోత్పాతం కనవస్తుందని ఎంత నేర్పుగా చెప్పాడు ఆ దర్శకుడు!

కానీ ఆ సినిమా స్పెయిన్ లో తీసారనీ, స్పానిష్ అంతర్యుద్ధం నేపథ్యంగా అల్లిన కథ అనీ మనకి తెలియకపోయినా కూడా ఆ సినిమా వదిలిపెట్టే ముద్ర ఏమీ పలచన కాదు. అన్నిటికన్నా ముఖ్యం అది ఒక పసిపాప అంతరంగంలోంచి, దృష్టికోణం లోంచి ప్రపంచాన్ని చూపించిన కథ. నేరమూ, శిక్షా, వంచనా, సాంత్వనా అనే ద్వంద్వాలు తెలియని ఒక పసిపాప కళ్ళల్లోంచి ఈ ప్రపంచాన్ని మనం కూడా చూస్తాం. అలా చూస్తున్నంతసేపూ భయంతో వణికిపోతాం. మనం మామూలుగా జీవిస్తున్న జీవితమే ఎంత నేరపూరితమో మనకి తెలియవస్తుంది. మనం పాల్పడుతున్న నేరమేమిటంటారా? సున్నితమైన హృదయాలతో సున్నితంగా స్పందించకపోవడమే!

జయతి మళ్ళీ నన్ను నిరుత్సాహ పరచలేదు. ఆమె ఏ పొగమంచును నాకు చూపించాలనుకున్నారో అదంతా నేను చూసాను.  అన్నిటికన్నా ముందు, ఆ పురాతన గ్రామం, ఆకుపచ్చని దిగంతం వైపు మెలికలు తిరుగుతూ సాగిపోయే రహదారీ, పత్రహీన పోప్లార్ తరుకాండాలు- ఆ లాండ్ స్కేప్ చూస్తుంటే ఆంటోనియో మచాడో కవిత్వం చదువుతున్నట్టే ఉంది. రాజకీయ నిర్బంధాలూ భయోద్వేగాలూ పక్కన పెట్టి కెమేరా రాసిన కవిత్వం చదవాలనుకునేవాళ్ళు కూడా ఈ సినిమా చూడవచ్చు. 

– వాడ్రేవు చిన వీర భద్రుడు


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this